Wednesday, December 20, 2017


రూ.2000నోట్ల ముద్రణ నిలిపివేత!
లేదంటే తక్కువ మొత్తంలో..
ఎస్‌బీఐ పరిశోధనా నివేదిక
దిల్లీ: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) రూ.2000 నోట్ల ముద్రణ నిలిపివేసి ఉండడం లేదా తక్కువ మొత్తంలో ముద్రిస్తుండడం జరుగుతూ ఉండొచ్చని ఎస్‌బీఐ తన పరిశోధన పత్రంలో అంచనా వేసింది. అందులో పలు ఆసక్తికర అంశాలను అది వెల్లడించింది. ఆ వివరాలు.. 
* ఆర్‌బీఐ ఇటీవల సమర్పించిన నివేదికను పరిశీలిస్తే.. మార్చి 2017 వరకు చెలామణీలో ఉన్న చిన్న మొత్తం కరెన్సీ విలువ రూ.3,50,100 కోట్ల వరకు ఉంది. 
అంటే డిసెంబరు 8 నాటికి మొత్తం చెలామణీలో ఉన్న నగదులో నుంచి వీటి విలువ తీసివేస్తే.. అధిక విలువ గల నోట్ల మొత్తం విలువ రూ.13,32,400 కోట్లుగా ఉన్నట్లు తేలింది. 
ఆర్థిక శాఖ ఇటీవల లోక్‌సభకు సమర్పించిన గణాంకాల ప్రకారం.. డిసెంబరు 8 నాటికి 1695.7 కోట్ల రూ.500 నోట్లు; 365.4 కోట్ల రూ.2000 నోట్లను ఆర్‌బీఐ ముద్రించింది. వీటి మొత్తం విలువ రూ.15,78,700 కోట్లు. 
*ఈ లెక్క ప్రకారం.. ఆర్‌బీఐ వద్ద(సరఫరా కాకుండా) ఉన్న పెద్ద నోట్ల విలువ(15,78,700-13,32,400 కోట్లు) రూ.2,46,300 కోట్లు అన్నమాట. ఆర్‌బీఐ రూ.50, రూ.200 నోట్లనూ ముద్రించిన నేపథ్యంలో పై విలువ తక్కువైనదిగానే భావించాలి. 
రూ.2000 నోటు లావాదేవీల పరంగా సవాళ్లను విసురుతున్న నేపథ్యంలో ఆర్‌బీఐ రూ.2000 నోట్ల ముద్రణను నిలిపివేయడం లేదా ద్రవ్యలభ్యత పరిస్థితులు చక్కబడ్డ నేపథ్యంలో చిన్న మొత్తంలో ముద్రించడమో జరుగుతూ ఉండాలి. అంటే మొత్తం చెలామణీలో ఉన్న నగదులో చిన్న నోట్ల వాటా 35 శాతంగా(విలువ పరంగా) ఉంది.

పనితీరు లక్ష్యం చేరలేకపోయాయ్‌
చాలా వరకు బ్యాంకులు విఫలం
పూర్తి మూలధన సాయం అందబోదు
ఆర్థిక శాఖ వెల్లడి
దిల్లీ: పనితీరు లక్ష్యాన్ని చేరడంలో చాలా వరకు ప్రభుత్వ రంగ బ్యాంకులు విఫలమయ్యాయని ఆర్థిక శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో మూలధన సాయానికి ఉద్దేశించిన మొత్తం నగదును వాటికి ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఇంద్రధనుష్‌ ప్రణాళిక ప్రకారం బ్యాంకులకు ప్రభుత్వం రూ.70,000 కోట్ల మూలధన సాయం చేస్తుంది. 2015-16; 2016-17లలో రూ.25,000 కోట్లు చొప్పున 2017-18; 2018-19లలో రూ.10,000 కోట్లు చొప్పున ఇవ్వాలి. ఇందులో ఇప్పటికే రూ.51,858 కోట్ల నిధులను ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రభుత్వం ఇచ్చింది. 2016-17లో 13 బ్యాంకులకు రూ.22,915 కోట్లను కేటాయించింది. అందులో రూ.16,414 కోట్లను(75%) తొలి దశ కింద ఇవ్వగా.. మిగతా మొత్తాన్ని పనితీరు ఆధారంగా ఇస్తామని తెలిపింది. అయితే ఏ ఒక్క బ్యాంకూ తమ లక్ష్యాలను చేరలేకపోవడంతో మిగతా (25%) మొత్తాన్ని విడుదల చేయలేదని ఆర్థిక శాఖ తెలిపింది.
కాగా, బ్యాంకులకు మూలధన పునర్నిర్మాణ పథకం కింద రూ.2.11 లక్షల కోట్ల సాయం అందిస్తామని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటించారు. ఇందులో రూ.1.35 లక్షల కోట్ల విలువైన రీక్యాపిటలైజేషన్‌ బాండ్లు ఉన్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. బాండ్ల జారీకి సంబంధించిన నిబంధనలపై ప్రభుత్వం పనిచేస్తోంది.
డియర్ కేటిఆర్ అంకుల్,
నా పేరు భూమిక. నా వయసు 8 ఏళ్ళు. ఉప్పల్ లో ఉంటాము.  జాన్సన్ అండ్ జాన్సన్ గ్రామర్ స్కూల్, నాచారం లో సెకండ్ క్లాస్ చదువుతున్నాను.  ఈ రోజు పొద్దున్నే నేను మా అక్క అమ్మతో కలిసి స్కూటీ మీద స్కూల్ కి వెళుతున్నాము. రోడ్డు మీద పెద్ద గుంత. అమ్మ బండి స్లో చేసింది. మా వెనక వస్తున్న లారీ అంకుల్ మా బండిని లారీతో గుద్దేసాడు. అంతే అమ్మ, నేను, అక్క కింద పడిపోయాం. నా తల బలంగా నేలకి గుద్దుకుంది. రక్తం కారిపోతోంది. అమ్మకి కూడా దెబ్బలు తగిలాయి, స్పృహ కోల్పోయింది. అక్కడ ఉన్న ఓ అంకుల్ నన్ను తన చేతుల్లో ఎత్తుకుని ఆసుపత్రికి తీసుకెళ్తున్నాడు, నా తల నుంచి రక్తం  కారిపోతూ ఉంది. ఐదు నిమిషాల్లో ఆసుపత్రికి చేరాము, డాక్టర్లు నన్ను చూసారు. నేను చనిపోయానట .  అక్కడ నుంచి నన్ను గాంధీ ఆసుపత్రి మార్చురీకి  తీసుకెళ్ళిపోయారు. ఇంకొక్క అయిదు నిమిషాలు ఉంటే రోల్ నంబర్ 28 అంటే  హాజరు పలకాల్సిన నేను మార్చురీ లో 28 నంబర్ బాక్సులో శవంగా మిగిలాను అంకుల్.
ఇవాంకా వస్తోందని చాలా చోట్ల రోడ్లు బాగు చేసారట. మా కాలనీకి కూడా ఇవాంకా వచ్చి ఉంటె నేను బ్రతికేదాన్ని కదా అంకుల్. ప్రభుత్వాన్ని మేమేమైనా  వజ్ర వైడూర్యాలు అడుగుతున్నామా అంకుల్. గుంతలు లేని రోడ్లే కదా అడుగుతున్నాం. ఎన్ని నెలల నుంచి ఈ రోడ్లు ఇంత అధ్వాన్నంగా ఉన్నాయో తెలుసా అంకుల్. మీరు,  కెసిఆర్  అంకుల్ రోడ్లు బాగుచేయమని అధికారులకి చెప్పారని చాలా సార్లు పత్రికల్లో వచ్చింది. అయినా రోడ్లు బాగు కాలేదు. రోడ్ల మీద గుంతలు లేకుండా చేయడం ఏమైనా రాకెట్ సైన్సా అంకుల్. అదే మంటే అధికారులు బీటీ కి నీటికి పడదు అని సాకులు చెప్పి మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. దేశమంతా వర్షాలు పడడం లేదా అక్కడ బీటీ రోడ్లు లేవా? అక్కడ రోడ్లు ఇంత అధ్వాన్నంగా లేవు కదా అంకుల్.  అయినా మన  అసలు రోడ్లు వేసేటప్పుడు క్వాలిటీ ఉంటె కదా అంకుల్, కనీసం పదేళ్ళు ఉండాల్సిన రోడ్లు పది నెలలు కూడా ఉండడం లేదు. ఇంత నాసిరకంగా రోడ్లు వేసినందుకు ఒక్క ఆఫీసర్ మీద అయినా, ఒక్క కాంట్రాక్టర్ మీద అయిన చర్య తీసుకున్నారా? అధికారులకి మీరంటే భయం ఉంటె కదా అంకుల్ సరిగ్గా పనిచేయడానికి.
ఈ ఆఫీసర్లకి, కాంట్రాక్టర్లకి, నాయకులకి  కూడా పిల్లలు ఉంటారు కదా. రేపు వాళ్ళ పరిస్థితి అయినా ఇంతే కదా. ఎందుకు ఇంత చిన్న విషయం అర్థం కాదు. మాబోటి సామాన్యుల ప్రాణాలు అంటే అంత లోకువా అంకుల్. నేనే కాదు అంకుల్ ఇంకెంతో మంది నా లాగా యాక్సిడెంట్ లలో చనిపోయినవారి శవాలు ఇక్కడ కుప్పలుగా ఉన్నాయి. అంకుల్ నా చావుతో నైనా మన హైదరాబాద్ రోడ్లు బాగుపడాలి. మీరు చాలా సమర్థులు అని మీకు చాలా అవార్డులు వస్తున్నాయి. మీరు తలచుకుంటే  ఈ రోడ్లు బాగుపడతాయి. ఒక వారం కేవలం రోడ్ల సమస్య మీదే మీరు పనిచేయండి. పని చేయని అధికారులని  పీకి పారెయ్యండి. కాంట్రాక్టర్లు తప్పు చేస్తే శిక్ష వేయండి. ఏమైనా చేయండి. రోడ్లు మాత్రం బాగు చేయండి అంకుల్. మా అక్క, అమ్మ, నా క్లాస్ మేట్స్, నా లాంటి మరెంతో మంది పిల్లలు, పెద్దల ప్రాణాలు, ఆరోగ్యం  కాపాడండి. చివరిగా, నా తోటి పిల్లలకి నా విజ్ఞప్తి, బండి నడిపేవారే కాదు, వెనక కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోండి. కేటిఆర్ అంకుల్, మీరు మాత్రం మరో ప్రాణం బలికాకముందే రోడ్లు బాగుచేయించండి.
ఇట్లు,
ఎప్పటికీ మిమ్మల్ని చూడలేని..
భూమిక.
note: ఈ రోజు అంటే 19న ఉప్పల్ లో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన భూమిక, రహదారి భద్రత పై ప్రజల్లో అవగాహన  కల్పించేందుకు కృషి చేస్తున్న i am not an idiot సంస్థ వ్యవస్థాపకులు, లోక్ సత్తా పార్టీ నగర నాయకులు అయిన దోసపాటి రాము మేనకోడలు.